🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 6:12 pm Posted by : peoples voice

పోలవరం వరం కాదు.. తెలంగాణకు శాపం _ ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి

News Image
పోలవరం వరం కాదు.. తెలంగాణకు శాపం

ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి

ఖమ్మం, అక్టోబర్ 11 ( పీపుల్స్ వాయిస్ ) :
పోలవరం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురయ్యాయని, లక్ష మంది ఆదివాసులు నిర్వాసితులయ్యారని ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) జిల్లా ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

నిజాం నవాబు రాముడికి గుడి కడితే జైశ్రీరామ్ అనే వారు.. ఇప్పుడు రాముడినే ముంచుతున్నారని, ఇది ఎంతమాత్రం సహించరానిదని యాదగిరి వ్యాఖ్యానించారు. తంగేడు పూలతో చెరువులు శుద్ధి అవుతాయని మన ఆడబిడ్డలు ఎన్నో ఏళ్ల క్రితమే గుర్తించారని, అందుకే బతుకమ్మ పండుగలో తంగేడు పూలతో బతుకమ్మలను పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తారని వివరించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పూలను పూజించడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సైతం అమలు కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికీకరణ పేరుతో ఫార్మా కంపెనీలను నెలకొల్పడం వల్ల అడవులు కనుమరుగవుతున్నాయని, దీంతో చెంచు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యపరచాల్సిన బాధ్యత టాస్క్‌పై ఉందని, నిజాలను నిర్భయంగా ప్రకటిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

టాస్క్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. ఫామ్‌-7 ద్వారా ఎవరి ఓటునైనా తొలగించే అవకాశం ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఎవరికీ కీలుబొమ్మగా మారకూడదని అన్నారు.

ఈ సమావేశానికి టాస్క్ రాష్ట్ర కో-కన్వీనర్ ములక సురేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పులి రాజు, డాక్టర్ ఆంజనేయులు, షేక్ నజీమా, బుక్కా సత్యనారాయణ, సంగమేశ్వరరావు, దశరథ రామ్, ఎన్‌.ఎస్‌. దశరథ రామ్, రఘు విశ్వ, మేకల సుగుణరావు, కట్టుకోజ్వాల రమేష్, రేలా శ్రీనివాస్, కళాకారులు పాగి వెంకన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home