🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 10:09 pm Posted by : పీపుల్స్ వాయిస్

తలుపులు మూసే.. ప్రజలకు ఎదురుచూపులే! టీ బిల్లుల కోసం చిరువ్యాపారి ప్రదక్షిణలు.. సమస్యలపై వచ్చే ప్రజలకు నిరీక్షణేనా?

News Image
తలుపులు మూసే.. ప్రజలకు ఎదురుచూపులే!

టీ బిల్లుల కోసం చిరువ్యాపారి ప్రదక్షిణలు.. సమస్యలపై వచ్చే ప్రజలకు నిరీక్షణేనా?

పాలేరు , అక్టోబర్ 18 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల ఎంపీడీవో కార్యాలయ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ సమస్యల పరిష్కారం కోసం మండలంలోని దూరప్రాంత గ్రామాల నుంచి కార్యాలయానికి వస్తున్న ప్రజలకు సరైన స్పందన లభించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడం, సమావేశాల పేరుతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

సమావేశాల పేరుతో నిరీక్షణేనా?

ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వచ్చినప్పుడు, అధికారులు కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, సమావేశాల్లో పాల్గొంటున్నారని చెప్పి నిరీక్షింపజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా సమస్యలపై స్పష్టమైన సమాధానం లభించడం లేదని కొందరు వాపోతున్నట్లు తెలుస్తోంది. దూరప్రాంతాల నుంచి ప్రయాణ ఖర్చులు భరించి, రోజువారీ పనులు వదులుకుని వచ్చే సామాన్య ప్రజలకు నిరాశే మిగులుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సిబ్బంది తీరుపై ఆరోపణలు

కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, ప్రజలకు కనీస సమాచారం అందించకుండా అటెండర్ల ద్వారా సమాధానాలు చెప్పిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు సిబ్బంది వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

టీ బిల్లుల కోసం చిరువ్యాపారి ఎదురుచూపులు!

మరోవైపు, ఎంపీడీవో కార్యాలయానికి టీ సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారి బాబురావుకు రావాల్సిన బకాయిల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వాపోతున్నట్లు సమాచారం. కష్టపడి టీ సరఫరా చేసినందుకు రావాల్సిన డబ్బుల కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వ్యాపారులు తమకు రావాల్సిన బిల్లుల కోసం సైతం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి..

ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సరైన సమాచారం, సమయానుకూల స్పందన అందించాలని స్థానికులు కోరుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను అనవసరంగా నిరీక్షింపజేయకుండా, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిరువ్యాపారి బాబురావుకు రావాల్సిన బకాయిలను పరిశీలించి, నిబంధనల ప్రకారం చెల్లింపులు చేపట్టాలని కోరుతున్నారు.

ఎంపీడీవో స్పందిస్తారా?

కూసుమంచి ఎంపీడీవో జశ్వంత్ కార్యాలయ పనితీరుపై వస్తున్న ఆరోపణలపై స్పందించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారా? చిరువ్యాపారి బాబురావుకు రావాల్సిన బకాయిల చెల్లింపులపై దృష్టి సారిస్తారా? అన్నది వేచి చూడాలి. ఈ ఆరోపణలపై ఎంపీడీవో జశ్వంత్ వివరణ తెలియాల్సి ఉంది.
🏠 Home