Poples Voice
Date of Publish : 22/10/2026, 8:44 pm
Published by PEOPLES VOICE

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
  • మిర్యాలగూడలో యునైటెడ్ దళిత క్రైస్తవుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాధన సదస్సు

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

మిర్యాలగూడలో యునైటెడ్ దళిత క్రైస్తవుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాధన సదస్సు

మిర్యాలగూడ, అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్): దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించి, విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. యునైటెడ్ దళిత క్రైస్తవుల ఫెడరేషన్ (యూడీసీఎఫ్) ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు విజయ గార్డెన్స్‌లో ‘దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా సాధన సదస్సు’ ఘనంగా నిర్వహించారు. పెదమాం డేవిడ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, డీఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్, ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దళిత క్రైస్తవులకు సామాజిక న్యాయం కల్పించాలి

సదస్సులో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించి, వారికి న్యాయం చేయాలని కోరారు. విద్య, ఉపాధి సహా వివిధ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మతం మారినా సామాజిక పరిస్థితుల్లో మార్పు లేదు

ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోవని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, వారికి ఎస్సీ హోదా కల్పించే అంశంపై న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దశాబ్దాలుగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ఆశించిన పరిష్కారం లభించకపోవడంపై పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరమైన హక్కులు, సామాజిక భద్రత, విద్యా, ఉద్యోగ అవకాశాలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సదస్సులో పాల్గొన్న నాయకులు కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 పలువురు ప్రముఖుల హాజరు

ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ప్రొఫెసర్ డాక్టర్ నతనియేలు, మర్రి ఎలియాస్, క్రిస్టాపర్, డి.ఐ. శాంసన్, ఆదిముల్ల ప్రభుదాస్, కడియం అబ్రహం, దుబ్బా డేవిడ్ రాజు, అంబటి ప్రభాకర్, చంద్రపాల్, జయమ్మ, విజయ్, శ్రీనివాస్, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save