అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి: IFTU డిమాండ్
కామేపల్లి, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్ ):
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని IFTU ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ సుభహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (IFTU) కామేపల్లి ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సీడీపీఓ ఉమాకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా షేక్ సుభహాన్ మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులపై అదనపు పని భారం మోపకుండా, వారి శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, శిథిలావస్థలో ఉన్న కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేసి, పదవీ విరమణ ప్రయోజనాలను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలపై సూపర్‌వైజర్ల వేధింపుల ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ అందించడంలో కీలకమైన అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో IFTU కామేపల్లి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి శిరోమణి, నాయకులు లక్ష్మీమణి, విజయ, కమల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.