Poples Voice
Date of Publish : 29/10/2026, 7:45 pm
Published by PEOPLES VOICE

మాజీ సర్పంచ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు _ నలుగురు నిందితుల అరెస్ట్

  • మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
  • సాంకేతిక పరిజ్ఞానం, ఫోరెన్సిక్ ఆధారాలతో దర్యాప్తు
  • బెంగళూరులో పాలిగ్రాఫ్ పరీక్షలు.. NFSU నిపుణుల సహకారం
  • రెండు కత్తులు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం
  • వైరా ఏసీపీ ఎన్. సారంగపాణి పర్యవేక్షణలో దర్యాప్తు
  • దర్యాప్తు అధికారులను అభినందించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

మాజీ సర్పంచ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఫోరెన్సిక్ ఆధారాలతో నలుగురు నిందితుల అరెస్ట్

ఖమ్మం క్రైమ్ , అక్టోబర్ 29 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావు (72) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఫోరెన్సిక్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.

2025 అక్టోబర్ 31న తెల్లవారుజామున రామారావు తన ఇంటి పక్కన ఉన్న కొట్టంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చింతకాని పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 324/2025తో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1), 190 కింద కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి భౌతిక ఆధారాలు సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగించారు.

దర్యాప్తులో భాగంగా 24 మంది వ్యక్తులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరగా, వారిలో ఆరుగురు స్వచ్ఛందంగా పరీక్షలకు సమ్మతి తెలిపారు. అనంతరం బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నిపుణుల సహకారంతోనూ ఆధారాలను విశ్లేషించారు. ఈ క్రమంలో లభించిన సమాచారం, ఇతర ఆధారాల ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వారిని బొజ్జపల్లి శ్రీనివాసరావు, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కారుపూడి ఉదయ్‌కుమార్‌గా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. నేరానికి ఉపయోగించినట్లు ఆరోపిస్తున్న రెండు కత్తులు, రెక్కీ నిర్వహణకు ఉపయోగించినట్లు పేర్కొన్న నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తును వైరా ఏసీపీ ఎన్. సారంగపాణి పర్యవేక్షించగా, వైరా సీఐ వై. వెంకట ప్రసాద్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. దర్యాప్తులో పాల్గొన్న అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించి రివార్డులు అందజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save