ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలి
అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యవర్గం డిమాండ్
ఖమ్మం, నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లాను పూర్తిస్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించి, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఖమ్మం జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. సంఘం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభంపై నాయకులు చర్చించారు.ఈ సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు గుర్రం అచ్చయ్య, రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వ్యవసాయం చేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కరువు నివారణ, సహాయక చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి, రైతుల నిర్లక్ష్యం వల్లే నష్టాలు వచ్చాయని నెపం వారిపైనే నెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.రబీ సీజన్‌లో వ్యవసాయాన్ని కాపాడేందుకు తక్కువ నీటితో సాగయ్యే కంది, పెసర, శనగ, మినుము, జొన్న తదితర పంటల విత్తనాలు, ఎరువులను తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు కోతలు లేకుండా రోజుకు కనీసం తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు.
ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఆహార పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున, వాణిజ్య పంటలు, కూరగాయల సాగుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని కోరారు. రైతుల అన్ని రకాల రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఖమ్మం జిల్లాలో కరువు నివారణకు సీతారామ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, భక్త రామదాసు, మంచుకొండ ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయి ఆయకట్టుకు విస్తరించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కొమ్మి కోమటి నాగేశ్వరరావు, గుగులోత్ తేజ్ నాయక్, సహాయ కార్యదర్శులు పాశం అప్పారావు, కుర్రా వెంకన్న, కోశాధికారి కేడోతు లక్ష్మణ్, సభ్యులు బానోత్ శంకర్, ధరావత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.