విప్లవ అమరవీరుల ఆశయ సాధనకు పోరాటాలు కొనసాగిస్తాం!
ఎల్లన్ననగర్‌లో ఘనంగా అమరవీరుల సంస్మరణ సభ
బూటకపు ఎన్‌కౌంటర్లలో విప్లవకారులను హతమార్చిన పాలకవర్గాలు – సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు
కొణిజర్ల, నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):
భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం పోరాడి అమరులైన విప్లవకారులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ గ్రామంలో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.సభలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. రామయ్య మాట్లాడుతూ.. దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన విప్లవ నాయకులను పాలకవర్గాలు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చిచంపాయని విమర్శించారు. పీడిత ప్రజల విముక్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.బత్తుల వెంకటేశ్వరరావు, పొట్ల రామనరసయ్య, శ్రీపాద శ్రీహరి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, నీలం రామచంద్రయ్య, ధర్మన్న, ఎల్లన్న, కాచనపల్లి, ముసిమి అమరవీరులు ప్రజా పోరాటాల్లో ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. దొరన్న, రాయల సుభాష్ చంద్రబోస్, డీవీ కృష్ణ, ఏనుగు అప్పయ్య, సీతక్క, పంచాది నిర్మల తదితరులు పీడిత ప్రజల హక్కుల కోసం చేసిన త్యాగాలను కొనియాడారు.సమసమాజ స్థాపన లక్ష్యంగా అమరవీరులు సాగించిన పోరాటాలను నేటి తరానికి తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్‌మియా, గ్రామ కార్యదర్శి గండికోట రమేష్, పార్టీ డివిజన్ నాయకులు రాపోలు కృష్ణ, గండికోట లక్ష్మణ్, వార్డు సభ్యుడు లాల్‌సింగ్, తారకక్క, మారోని, మంగమ్మ, గోగుల వెంకన్న, రాపోలు శీను, చీనియా, మోతిలాల్, విజయ తదితరులు పాల్గొన్నారు.