Poples Voice
Date of Publish : 03/11/2026, 5:07 pm
Published by PEOPLES VOICE

అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్

అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి!

విద్యార్థి హక్కుల కోసం ప్రాణాలర్పించిన శ్రీహరి నేటి తరానికి ఆదర్శం

రాజారంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీహరి, పోట్ల రామ నరసయ్యలకు ఘన నివాళి

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

అంతరాలు లేని సమసమాజ స్థాపన కోసం, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిండు ప్రాణాలను అర్పించిన అమరుడు శ్రీపాద శ్రీహరి నేటి విద్యార్థి తరానికి ఆదర్శప్రాయుడని పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్, జిల్లా యాక్టింగ్ కార్యదర్శి తిమ్మిరి రఘుబాబు అన్నారు.జిల్లా నాయకుడు స్టాలిన్ అధ్యక్షతన మంగళవారం రాజారం గ్రామంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరుడు శ్రీపాద శ్రీహరి, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోట్ల రామ నరసయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి వెంగళరావు ప్రభుత్వం 1975 నవంబర్ 3న ప్రజా ఉద్యమ నాయకుడు పోట్ల రామ నరసయ్య, విద్యార్థి ఉద్యమ నేత శ్రీపాద శ్రీహరిని అరెస్టు చేసి వరంగల్ జిల్లా చిలుకలగుట్ట అడవిలో కాల్చి చంపిందని పేర్కొన్నారు. వారి అమరత్వం ప్రజా పోరాటాలకు, వర్గపోరాటాలకు నిరంతర స్ఫూర్తినిస్తుందని అన్నారు.50 ఏళ్లు గడిచినా పాలకులు మారారే తప్ప ప్రజల బతుకులు మారలేదని విమర్శించారు. ప్రపంచీకరణలో భాగంగా తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు దారితీశాయని అన్నారు. ఫలితంగా పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరమవుతోందని, పేదలకు వైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ, ఉద్యోగ భద్రత లేకుండా చాలీచాలని వేతనాలతో జీవితాలను వెళ్లదీస్తున్నారని తెలిపారు.నాడు విద్య, వైద్యం, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలపై గొంతెత్తిన విద్యార్థుల ఉద్యమాలను ఎమర్జెన్సీ పేరుతో అణచివేసి, ఉద్యమకారులను హతమార్చారని గుర్తుచేశారు. నేటికీ అదే తరహా సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, యువత ఐక్యంగా పిడికిళ్లు బిగించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ప్రశ్నించే గొంతుకలు లేకపోతే పేపర్ లీకేజీలు, అవినీతి, అక్రమాలు మరింత పెరిగి విద్యార్థి యువత భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా విధానం సాధన కోసం నిరంతర ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నాయకులు స్టాలిన్, కార్తీక్ రెడ్డి, సుశాంత్, గణేష్, సిద్ధు, బాలు, చరణ్, ప్రవీణ్, అభిలాష్, సుమన్‌లతో పాటు సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు తిమ్మిడి హనుమంతరావు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save