Poples Voice
Date of Publish : 03/11/2026, 5:17 pm
Published by PEOPLES VOICE

శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్

అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయాల సాధనకు ఉద్యమిద్దాం!

దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువత పోరాడాలి

రాజారంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంస్మరణ సభ

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయాల సాధన కోసం విద్యార్థులు, యువత దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శులు గోకినపల్లి మస్తాన్, వంగూరి వెంకటేష్ పిలుపునిచ్చారు.

విప్లవ యోధుడు శ్రీపాద శ్రీహరి వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజారాం గ్రామంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీపాద శ్రీహరి స్థూపం వద్ద సాదిక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ పీడీఎస్‌యూ జెండాను ఆవిష్కరించగా, మరో రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి వెంకటేష్ స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థూపం నుంచి శ్రీపాద శ్రీహరి విగ్రహం వరకు వందలాది మంది విద్యార్థులు, నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరుడు శ్రీపాద శ్రీహరికి జోహార్లు అంటూ నినాదాలు చేశారు.అనంతరం పీడీఎస్‌యూ కోశాధికారి మొక్క సురేష్ అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద శ్రీహరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర సహాయ కార్యదర్శులు గోకినపల్లి మస్తాన్, వంగూరి వెంకటేష్ మాట్లాడుతూ.. శ్రీపాద శ్రీహరి అమరత్వం ప్రజా పోరాటాల చరిత్రలో చెరగని అధ్యాయమని పేర్కొన్నారు. దోపిడీ, పీడన, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం, చేసిన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పాలకవర్గాలు ఎన్ని నిర్బంధాలు, అణచివేత చర్యలకు పాల్పడినా ప్రజల హక్కుల కోసం సాగుతున్న పోరాటాలను అడ్డుకోలేవని స్పష్టం చేశారు."సుక్కలాంటి సుక్కల్లో లక్షలాది సుక్కల్లో ఏ సుక్కల్లో ఉన్నావో శ్రీపాద శ్రీహరి" అనే పాట నేటికీ ప్రజల గుండెల్లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతోందని అన్నారు. ములుగు అడవుల నుంచి తెలంగాణ గడ్డ వరకు ఆయన త్యాగం ప్రజా పోరాటాల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

నేటికీ సమాజంలో కొనసాగుతున్న దోపిడీ, పేదరికం, నిరుద్యోగం, విద్యారంగంలో ప్రైవేటీకరణ, రైతులు, కార్మికులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలను కేవలం సంస్మరణ సభలకే పరిమితం చేయకుండా, వారు ఆశించిన సమసమాజ స్థాపన కోసం ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ పీడీఎస్‌యూ నాయకులు మందుల రాజేందర్ ప్రసాద్, గొర్రపాటి రమేష్, ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శులు డి. వెంకటేష్, అజయ్, కోశాధికారి రాము, జిల్లా నాయకులు చందు, చి. శ్రీకాంత్, సాగర్, ఎన్. శ్రీకాంత్, ఈశ్వరి, ప్రియాంక, అలేఖ్య, నందు, సమీనా బేగం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save