తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం!
ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):
తల్లాడ–దేవరపల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తుండగా, హైదరాబాద్ నుంచి తిరువూరుకు ప్లాస్టిక్ సీసాల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఓవర్‌టేక్ చేసే క్రమంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.