Poples Voice
Date of Publish : 05/11/2026, 5:01 pm
Published by PEOPLES VOICE

బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి_పోటు రంగారావు

బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి

అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి – సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

కొణిజర్ల, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):

బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. దేశంలోని పేదల కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు తమ జీవితాలను అంకితం చేసిన కమ్యూనిస్టు అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రామ నర్సయ్య నగర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అమరవీరుల సభకు ముందు గ్రామంలో ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామ కార్యదర్శి గుగులోత్ శివ అధ్యక్షతన జరిగిన సభలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పోటురంగారావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం దశాబ్దాలు గడుస్తున్నా పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పాలకుల విధానాల ఫలితంగా పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, దేశంలో నిరుద్యోగం, పేదరికం, వలసలు, ఆకలి చావులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రజల శ్రమశక్తిని కారుచౌకగా తాకట్టు పెడుతున్న పాలకుల విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ ఉద్యమాల పోరాట స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని విమర్శించారు. అమరవీరుల త్యాగాలు, పోరాటాల స్ఫూర్తితో నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్య సాధన దిశగా విస్తృత ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.గత పన్నెండేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు, దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని జైళ్లపాలు చేస్తోందని విమర్శించారు.దేశంలో ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును సైతం ప్రశ్నార్థకం చేసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 13.40 కోట్ల ఓట్లు తొలగించారన్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా కనుసన్నల్లో జరుగుతున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, జి. రామయ్య, కోయాల శ్రీను, కుడుం ఝాన్సీ, వైరా డివిజన్ కార్యదర్శి ఎస్.కె. లాల్మియా, పాశం అప్పారావు, తడకమళ్ల సీతారాములు, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, తడకమళ్ల వెంకన్న, ఉపేందర్, వీరబాబు, వెంకన్న, కోటేశ్వరరావు, రామకృష్ణ, కోటయ్య, పీవోడబ్ల్యూ నాయకులు జ్యోతి, అప్పమ్మ, గుగులోత్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save