పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు!
ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ రాష్ట్రంలో దూదేకుల ముస్లింల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై దూదేకుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బడే సాహెబ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల కేటాయింపు దూదేకుల సమాజం చిరకాల ఆకాంక్ష నెరవేరేందుకు కీలక ముందడుగు అని పేర్కొన్నారు.శుక్రవారం ఖమ్మంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన దూదేకుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న విడుదల చేసిన జీవో నంబర్ 14 ప్రకారం రాష్ట్రంలోని 38 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రూ.88 కోట్లు కేటాయించిందని, ఇందులో దూదేకుల ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచి, ఆ తర్వాత కూడా దూదేకుల సమాజ హక్కుల కోసం దివంగత నేత పకీర్ సాహెబ్ చేసిన కృషి ఎనలేనిదని, ఆయన పోరాటం, శ్రమ ఫలితంగానే నేడు ఆత్మగౌరవ భవనానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గాలిబ్ సాహెబ్ కృషి కూడా ఈ సాధనలో కీలకమని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో సుమారు 16 లక్షల మందికి పైగా ఉన్న దూదేకుల సమాజ ప్రజలందరికీ ఈ ఆత్మగౌరవ భవనంపై సమాన హక్కు ఉంటుందని బడే సాహెబ్ స్పష్టం చేశారు. ఈ భవనం ఏ ఒక్క వ్యక్తికో, వర్గానికో పరిమితం కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ చెందుతుందని, అందరి సమష్టి పోరాట ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సలీం మాట్లాడుతూ.. దూదేకుల ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. దివంగత నేతలు పకీర్ సాహెబ్, గాలిబ్ సాహెబ్ సాగించిన పోరాటాల ఫలితంగానే ఈ రోజు భవన నిర్మాణానికి మార్గం సుగమమైందని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ కలాం, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ నాగ సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, కైకొండాయిగూడెం జిల్లా జేఏసీ ఉపాధ్యక్షుడు షేక్ మౌలాలి, ఖమ్మం నగర అధ్యక్షుడు షేక్ అన్వర్ పాషా, జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ వలి, కోటపాడు సైదులు, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.