పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!
హైదరాబాద్‌కు కల్తీ పాల సరఫరా.. పోచారంలో తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసుల దాడి
హైదరాబాద్, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పాల ముఠా గుట్టును మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో రహస్యంగా నిర్వహిస్తున్న సింథటిక్ పాల తయారీ కేంద్రంపై శుక్రవారం రాత్రి దాడి చేసి భారీగా కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేశారు.
పోచారం గ్రామానికి చెందిన ఆండే శ్రీశైలం (43) తన ఇంట్లోనే అక్రమంగా కల్తీ పాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాలపొడిలో నీటితో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కలిపి సింథటిక్ పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో 100 లీటర్ల కల్తీ పాలు, 35 కిలోల ధోల్‌పూర్ బ్రాండ్ పాలపొడి, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తయారు చేసిన కల్తీ పాలను హైదరాబాద్ నగరంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.నిందితుడు శ్రీశైలంపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ కల్తీ పాల తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా? నగరంలో ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ పాల దందాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.