సోషల్ మీడియా వేధింపుల కేసులో నిందితుడి అరెస్టు.. చింతకాని పోలీసుల చర్యలు!
చింతకాని, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):
సోషల్ మీడియా వేదికలపై మైనర్ బాలికలు, మహిళల పట్ల అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చింతకాని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు చింతకాని పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 246/2026 కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఐటీ చట్టంతో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సోషల్ మీడియా ద్వారా ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా ధైర్యంగా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని పోలీసులు స్పష్టం చేశారు.