Poples Voice
Date of Publish : 09/11/2026, 9:24 am
Published by PEOPLES VOICE

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. రూ.13 లక్షల స్కాం గుట్టురట్టు!

  • నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కుమారుడికి కారుణ్య ఉద్యోగం
  • ఉద్యోగం కోసం సుమారు రూ.13 లక్షల ఒప్పందం జరిగినట్లు పోలీసుల గుర్తింపు
  • 14 మంది అరెస్ట్.. రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం
  • మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. రూ.13 లక్షల స్కాం గుట్టురట్టు!

నల్గొండలో సంచలనం.. 14 మంది అరెస్ట్.. మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

నల్గొండ, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):

నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. పదవీ విరమణ అనంతరం మరణించిన ఉద్యోగిని, సర్వీసులో ఉండగానే మృతి చెందినట్లు నకిలీ రికార్డులు సృష్టించి ఆయన కుమారుడికి ఉద్యోగం ఇప్పించిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న పదవీ విరమణ చేశారు. అనారోగ్యంతో అదే ఏడాది నవంబర్ 17న మృతి చెందారు. అయితే, పదవీ విరమణ అనంతరం మరణించడంతో కారుణ్య నియామకానికి అర్హత లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమానికి తెరలేపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.వెంకటేశ్వర్లు 2025 మే 28న, అంటే పదవీ విరమణకు ముందే మరణించినట్లు నకిలీ రికార్డులు సృష్టించారు. ఇందుకోసం ముందుగా ఆధార్ కార్డులోని చిరునామాను మీ-సేవా కేంద్రం ద్వారా నల్గొండ పట్టణానికి మార్చినట్లు గుర్తించారు. అనంతరం మున్సిపల్ అధికారుల సహకారంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ పత్రాల ఆధారంగా వెంకటేశ్వర్లు కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం ఇప్పించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.13 లక్షల మేర ఒప్పందం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడి భార్య వసంత, డీఎంహెచ్‌వో కార్యాలయ సీసీ పోలె రంజిత్ కుమార్ మధ్య ఈ ఒప్పందం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.ఈ అక్రమంపై నల్గొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ నవంబర్ 4న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు, బంధువులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save