రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి - భూక్య వీరభద్రం
వైరా, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):
అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న 36వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం వైరా డివిజన్ సహాయ కార్యదర్శి భూక్య వీరభద్రం పిలుపునిచ్చారు. మహాసభల ప్రారంభం సందర్భంగా నవంబర్ 15న నల్గొండలో నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.రైతు బహిరంగ సభ సన్నాహకంగా నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ఎం.డి. ఇస్మాయిల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూక్య వీరభద్రం మాట్లాడుతూ.. దాదాపు 40 సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరుగుతున్న అఖిల భారత స్థాయి రైతు మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం కరువు, వర్షాభావ పరిస్థితులు, తుఫాన్ల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రభావంతో పత్తి, పాల ఉత్పత్తిదారులు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాల వల్ల చిన్న, సన్నకారు రైతులు భూములకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధానాలు గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రాజెక్టుల పేరుతో హామీలు ఇచ్చిన పాలకులు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.రైతాంగ సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు, రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. నల్గొండలో జరగనున్న రైతు బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రైతు సంఘం వైరా డివిజన్ కార్యదర్శి దుర్గి కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె. నరేంద్ర, డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, కె. ఉమావతి, కార్యదర్శివర్గ సభ్యులు రేగళ్ల మంగయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ధరావత్ వినోద్ కుమార్, పార్టీ నాయకులు కరపటి సీతారాములు, ముక్క సీతారాములు, పాసిని నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు ముండ్ల ఏకాంబరం, వల్లబోయిన కొండలరావు, గంగాధరని ఉపేందర్, ధరావత్ రవికుమార్, సీఐటీయూ నాయకురాలు వై. రాధ తదితరులు పాల్గొన్నారు.