Poples Voice
Date of Publish : 11/11/2026, 7:44 pm
Published by PEOPLES VOICE

ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు

ప్రజా గర్జనను జయప్రదం చేయండి

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ

సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపు

సత్తుపల్లి, నవంబర్ 11 (పీపుల్స్ వాయిస్):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన ప్రదర్శన, బహిరంగ సభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పిలుపునిచ్చారు.దేశంలోని కీలక వనరులు, సంపదలను అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు, విదేశీ కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో దళితులు, మైనార్టీలు, పేద వర్గాలు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల 40 లక్షల ఓట్ల తొలగింపు ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

జీఎస్టీ పేరుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను తక్షణమే తగ్గించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆకట్టుకుందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మినహా మిగతా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.రాష్ట్రంలోని పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములను లాక్కోవడం ఆపాలని డిమాండ్ చేశారు. అటవీ, రెవెన్యూ అధికారుల అక్రమాలు, వేధింపులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం సత్తుపల్లిలోని నీలం రామచంద్రయ్య భవనంలో గంట శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ కల్లూరు డివిజన్ కమిటీ సమావేశానికి సీవై పుల్లయ్య ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా గర్జనలో కార్మికులు, కర్షకులు, మహిళలు, యువత, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కల్లూరు డివిజన్ కార్యదర్శి వెంకటరెడ్డి, నాయకులు అమర్లపూడి శరత్, బిరెల్లి లాజర్, మాల్యాద్రి, గంటా వెంకటనర్సమ్మ, ఒగ్గు నాగిరెడ్డి, కే. పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save