ప్రజా గర్జనను జయప్రదం చేయండి
డిసెంబర్ 29న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య పిలుపు
నేలకొండపల్లి, నవంబర్ 13 (పీపుల్స్ వాయిస్):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య పిలుపునిచ్చారు.గురువారం నేలకొండపల్లిలో పగిడికత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపద, కీలక వనరులను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు, విదేశీ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో పేదలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నాయకులు పగిడికత్తుల రామదాసు, చిర్ర బిక్షం, పగిడికత్తుల నాగేశ్వరరావు, దామల్ల రామదాసు, షకీలా తదితరులు పాల్గొన్నారు.