తీన్మార్ మల్లన్న పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను ఖండించిన టీఆర్పీ
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
ఘటన వెనుక కుట్ర కోణాన్ని నిగ్గుతేల్చాలి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే సీఎం రాజీనామా చేయాలి: టీఆర్పీ ఖమ్మం జిల్లా నేతల డిమాండ్
ఖమ్మం, నవంబర్ 13 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన ప్రజా పాదయాత్రపై లారీ దూసుకొచ్చిన ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. మోత్కూరు సమీపంలోని మాలగిరి ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతుండగా వేగంగా వచ్చిన లారీ యాత్రలోని వాహనాన్ని, కారును ఢీకొట్టడంతో ఐదారుగురు తీవ్రంగా గాయపడినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.ఈ ఘటనపై జిల్లా ఇన్‌చార్జ్ గట్ల రాజన్న, జిల్లా అధ్యక్షుడు దామల సత్యం మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల సాధన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు.
ఇది సాధారణ ప్రమాదమా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఘటన వెనుక ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా, ఏ రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న బహుజన నాయకులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను, ప్రజా పోరాటాలను భౌతిక దాడులతో అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై చిత్తశుద్ధితో స్పందించి ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ గట్ల రాజన్న, జిల్లా అధ్యక్షుడు దామల సత్యం, జిల్లా ఉపాధ్యక్షుడు పెరమలపల్లి నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు తేలపుట్ట జగపతి, టౌన్ అధ్యక్షుడు కొప్పుల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు వినయ్, టౌన్ ప్రధాన కార్యదర్శి కేతవరపు లెనిన్ పాల్గొన్నారు.అలాగే మానవ హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ చలమల హైమావతి, కిరణ్మయి, అనిత, మాధవి, సాయి, సైదులు, చారి తదితరులు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పలువురు నూతనంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.