Poples Voice
Date of Publish : 13/11/2026, 8:25 pm
Published by PEOPLES VOICE

ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సీ.వై. పుల్లయ్య

ప్రజా గర్జనను జయప్రదం చేయండి

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య పిలుపు

ఖమ్మం, నవంబర్ 13 (పీపుల్స్ వాయిస్):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.శుక్రవారం వైరా డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం మేడికొండల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యవక్తగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ దేశంలోని కీలక వనరులు, సంపదను అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలతో పాటు విదేశీ కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు.ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో దళితులు, మైనార్టీలు, పేదలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వర్గాలకు చెందిన వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల 40 లక్షల ఓట్ల తొలగింపు చర్యను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.జీఎస్టీ పేరుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మార్చారని విమర్శించారు. పెరిగిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు వాగ్దానాలు చేసిందని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మినహా మిగిలిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములను లాక్కోవడం ఆపాలని, అటవీ, రెవెన్యూ అధికారుల అక్రమాలు, ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా గర్జనలో ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో వైరా డివిజన్ కార్యదర్శి ఎస్.కె. లాల్ మియా, పాశం అప్పారావు, ఎలదండి బాబు, కొండె వెంకటేశ్వర్లు, వడ్డె సత్యం, ఎస్.కె. జానీ, మేడికొండల్ రావు, రాపోలు కృష్ణ, గండికోట లక్ష్మణ్, చింతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save