వెలుగుమట్ల భూదాన భూమికి ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంటాం!
ఇళ్లు కోల్పోయిన 729 మంది పేదలకు స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
అర్హులందరికీ వెలుగుమట్లలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకుల డిమాండ్
ఖమ్మం, నవంబర్ 17 (పీపుల్స్ వాయిస్):
వెలుగుమట్ల భూదాన భూమిలో పేదలు నిర్మించుకున్న 729 ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిన నేపథ్యంలో, బాధితులందరికీ అదే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీ వై పుల్లయ్య, కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల అశోక్, ఇళ్ల స్థలాల సాధన సమితి నాయకుడు వర్గాని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకుండా మిగిలిన భూదాన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలనే ఆలోచనను అడ్డుకుంటామని హెచ్చరించారు.మంగళవారం మాస్ లైన్ ఇళ్ల స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో వెలుగుమట్ల భూదాన భూమి నిర్వాసితులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూదాన భూమిలో ఇళ్లు కూల్చివేయబడిన వారంతా పేదలేనని పేర్కొన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, తమకున్న కొద్దిపాటి స్థిర, చరాస్తులను అమ్ముకుని, అప్పులు చేసి, అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని తెలిపారు. సుమారు ఏడేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ల కూల్చివేత సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అప్పటి కలెక్టర్ బాధితులకు న్యాయం చేస్తామని, అర్హులైన వారందరికీ స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని నాయకులు గుర్తుచేశారు. ఇప్పటికే 311 మందికి స్థలాలు కేటాయించగా, వారిలో 125 మందికి భూదాన భూమితో గతంలో ఎలాంటి సంబంధం లేదని నాయకులు ఆరోపించారు. అక్రమ పద్ధతుల్లో కొందరు స్థలాలు, ఇళ్లు పొందారని పేర్కొన్నారు.
అర్హులైన బాధితులందరికీ అదే భూదాన భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి ఇతర అవసరాలకు వినియోగించాలని చూస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని, భూదాన భూమిలో ఇళ్లు కోల్పోయిన ప్రతి అర్హ కుటుంబానికి అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి (డీఆర్ఓ) వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కొల్లేటి నాగేశ్వరరావు, బి. వెంకటేశ్వరరావు, కవిత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.