తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు
అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా.. సరిహద్దు మార్గంలో వాహనాల తనిఖీలు
అక్రమ ఇసుక, రేషన్ బియ్యం, గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై గజ్జల నరేష్
ఖమ్మం, నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీస్ కమిషనర్ సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మార్గంలో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు.ఈ చెక్‌పోస్ట్ ద్వారా సరిహద్దు మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు తనిఖీ చేయనున్నారు. ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణా, రేషన్ బియ్యం అక్రమ తరలింపు, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. అనుమానాస్పద వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించడంతో పాటు, అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు లభిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు.ఈ సందర్భంగా ఎస్సై గజ్జల నరేష్ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైన సందర్భాల్లో బైండోవర్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణా నియంత్రణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.అనంతరం గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావు మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతంలో అక్రమ ఇసుక, రేషన్ బియ్యం, గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల భద్రతతో పాటు అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకున్న జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్, చింతకాని ఎస్సై గజ్జల నరేష్‌కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.