డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజాగర్జనను జయప్రదం చేయండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ ప్రదర్శన, బహిరంగ సభ
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్.కె ల్మియా పిలుపు
తల్లాడ , నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్):
డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ ప్రదర్శన, ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్మియా పిలుపునిచ్చారు. తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని మౌలిక సమస్యలను పట్టించుకోకుండా మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, మూఢనమ్మకాలను పెంచుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతూ నిరంకుశ పోకడలను అనుసరిస్తోందని విమర్శించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, పేదలు, తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల 40 లక్షల ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నల్లధనాన్ని వెలికితీస్తామంటూ పెద్ద నోట్ల రద్దు చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, ఆశించిన ఫలితాలు సాధించలేదని విమర్శించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ఓటు చోరీని అరికట్టాలని, ఇందుకు బాధ్యులైన జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని లాల్మియా డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. చౌకధరల దుకాణాల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని, అన్ని రకాల పెన్షన్లను హామీ మేరకు పెంచి అమలు చేయాలని అన్నారు.కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, కార్మికులు, రైతులు, పేదల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ప్రజాగర్జనలో ప్రజలు, కార్మికులు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యకర్తల సమావేశంలో పలువురు పాల్గొనగా..ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తల్లాడ-ఏన్కూరు సంయుక్త మండల కార్యదర్శి కె. వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి డి. శ్రీనివాసరావు, పటాన్ నాగులమీరా, ధారావతు రమణ, గొడ్ల పుల్లమ్మ, గడ్డం వెంకులు, ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు.