మా భూమి మాకు ఇవ్వండి!
ఖమ్మంలో జర్నలిస్టుల నిరసన గళం
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బైఠాయింపు.. ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పోరు ఆగదని హెచ్చరిక
ప్రభుత్వాన్ని నిలదీసిన టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి
ఖమ్మం, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. గత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం పొంది ఖమ్మం జర్నలిస్టుల కోసం 23.2 ఎకరాల భూమిని కేటాయిస్తూ 147 జీవో విడుదల చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ భూమిని జర్నలిస్టులకు పంపిణీ చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 'మా భూమి మాకు ఇవ్వండి.. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు ఇంటి జాగా ఇవ్వరా?' అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ప్రెస్ క్లబ్ నుంచి జర్నలిస్టులు బైక్ ర్యాలీగా బయలుదేరి, అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని అమలు చేయాలని అనేక రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల బతుకులు మాత్రం మారడం లేదని విమర్శించారు.
గత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో ఖమ్మం జర్నలిస్టులకు 23.2 ఎకరాల భూమిని కేటాయిస్తూ 147 జీవో విడుదల చేసిందని, ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అర్హులైన జర్నలిస్టులకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అయితే భూమిని జర్నలిస్టులకు బదలాయించకుండా ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 18 మంది జర్నలిస్టులు మృతి చెందారని, వారి ఆశయాలు, కుటుంబ సభ్యుల ఆకాంక్షలు నెరవేరకుండానే కాలం గడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే ఖమ్మం పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని పంపిణీ చేయడానికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు దశలవారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జర్నలిస్టులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం జర్నలిస్టు వర్గాల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు తమ పోరాటం ఆగదని జర్నలిస్టులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, గట్టికొప్పుల ప్రశాంత్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, ఉపాధ్యక్షులు మందుల ఉపేందర్, బిగ్ టీవీ భాస్కర్, ఆర్టీవీ ఉదయ్, మందటి వెంకటరమణ, వనం నాగయ్య, కలువకోలను హరీష్ రావు, శ్రీధర్ శర్మ, రాజ్ న్యూస్ ఉపేందర్, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, అశోక్, కళ్యాణ్, సాయి, నగర కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి బిక్కీ గోపి, జర్నలిస్టు నేతలు జీవన్ రెడ్డి, కె.వి. మోహన్, ముత్యాల కోటేశ్వరరావు, పానకాల రావు, మీడియా ఇన్చార్జి తిరుపతి రావు, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, శేఖర్, నాగేశ్వరరావు, సుధాకర్, బాబు, ఫోటోగ్రాఫర్లు రాజు, మహేష్, రవి, యూనియన్ నేతలు ఉత్కంఠం శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, ఉల్లోజు రమేష్, గౌరీ శంకర్, కూరపాటి నరేష్, బోనగిరి యాదగిరి, రేపాక యాదగిరి, హుస్సేన్, నాగశేఖర్, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, బి. అప్పారావు, శ్రీధర్, పెంటి వెంకటేశ్వర్లు, రవి, జక్కుల వెంకటరమణ, బిక్షం, శ్రీను, పులి శ్రీను, లింగయ్య, ఐఎన్బీ రమేష్, గణేష్, మహిళా ప్రతినిధులు రోజా, మాధవి, కిరణ్మయి, పాషా, వేణుగోపాల్, దాసు, రాంబాబు, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
