Poples Voice
Date of Publish : 21/11/2026, 7:49 am
Published by PEOPLES VOICE

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే! మామిడి సోమయ్య

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే!

జర్నలిస్టుల ధర్నాకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మద్దతు

ఇళ్ల స్థలాల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో జర్నలిస్టుల ఆందోళన

హైదరాబాద్, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. పేద ప్రజల మాదిరిగానే జర్నలిస్టులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి సైతం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.ధర్నాకు అధ్యక్షత వహించిన

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించేందుకు గత 18 ఏళ్లుగా సొసైటీ పోరాటం చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలిచ్చి మోసం చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్టు సంఘం పేరుతో కొందరు సోకాల్డ్ జర్నలిస్టు నాయకులు తమ సొసైటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.

ఈ ధర్నాకు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షురాలు హేమ సుదర్శన్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ అధికార ప్రతినిధి సలీమ్ పాషా, నగర అధ్యక్షుడు ఎం. నర్సయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు మెరుగు చంద్రమోహన్, సీనియర్ మహిళా జర్నలిస్టు ప్రియా చౌదరి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.అలాగే టీజేఎఫ్ నాయకులు కుంచం శ్రీనివాస్, వి. రవికుమార్, ఎం. రవికుమార్, సొసైటీ డైరెక్టర్లు యర్రమిల్లి రామారావు, వీరేశం, మహిళా జర్నలిస్టులు సీబీ లక్ష్మి, నాగవాణి తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save