Poples Voice
Date of Publish : 21/11/2026, 8:00 am
Published by PEOPLES VOICE

మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి_ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్

మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

ప్రజా సమస్యలను విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతున్నారు

డిసెంబర్ 29న హైదరాబాద్‌లో జరిగే ప్రజా గర్జనను జయప్రదం చేయాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్

కొణిజర్ల, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్మియా పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొణిజర్ల మండల కేంద్రంలో వడ్డే సత్యం అధ్యక్షతన సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కే లాల్మియా మాట్లాడుతూ.. దేశంలోని కీలక వనరులు, సంపదను అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలతో పాటు విదేశీ కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు.ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో దళితులు, మైనార్టీలు, పేద వర్గాలకు చెందినవారు, తమకు గిట్టని వారి ఓట్లు తొలగించారని, సుమారు 13 కోట్ల 40 లక్షల ఓట్ల తొలగింపు చర్యను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీ 12 ఏళ్ల పాలనలో ధనవంతులు మరింత సంపన్నులుగా మారుతుండగా, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని విమర్శించారు. దేశంలో సుమారు 90 కోట్ల మంది రేషన్ బియ్యంపై ఆధారపడుతున్నారని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రశ్నించారు.డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేర్లతో గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ దేశంలో విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. రామమందిర నిర్మాణానికి సంబంధించిన విరాళాల విషయంలోనూ అవకతవకలు జరిగాయని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన ప్రదర్శన, భారీ బహిరంగ సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కొణిజర్ల మండల నాయకులు పాశం అప్పారావు, మేడికొండలరావు, వడ్డే సత్యం, రాపోలు కృష్ణ, గండికోట లక్ష్మణ్, కోయడ లక్ష్మీనారాయణ, గోగుల వెంకన్న, గండికోట బాబు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save