Poples Voice
Date of Publish : 21/11/2026, 8:02 am
Published by PEOPLES VOICE

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి _ షేక్ లాల్ మహమ్మద్

వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

20 రోజులుగా వరి కోతలు జరుగుతున్నా ప్రారంభంకాని ధాన్యం కొనుగోళ్లు

వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి: మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్ మహమ్మద్

వైరా, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

వైరా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్ మహమ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైరా మండలంలో రైతులు వరి కోతలు ప్రారంభించి సుమారు 20 రోజులు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.గతంలో మాదిరిగా రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించకుండా, ప్రభుత్వ గోడౌన్లకు తరలించే విధానం అమలు చేయనున్నట్లు సమాచారం వస్తోందని, ఈ కారణంగానే రైతులకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు చర్చించుకుంటున్నారని తెలిపారు.ప్రభుత్వం పాత విధానంలోనైనా, కొత్త విధానంలోనైనా కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే రైతులు అధిక పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి మరింత నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల రైతులకు అదనపు భారంగా మారుతుందని అన్నారు.కావున ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వైరా మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని షేక్ లాల్ మహమ్మద్ కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save