ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!
ఉమెన్స్ కళాశాల ఎదుట PDSU నిరసన.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్
ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు గోగినపల్లి మస్తాన్ మాట్లాడుతూ.. విలీనం పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉనికిని, అధ్యాపకుల పోస్టులను, పేద విద్యార్థుల విద్యా అవకాశాలను దెబ్బతీయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ, పేద విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ప్రధాన విద్యా ఆధారమని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విలీన ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు గాంధీ, రాము, శ్రీకాంత్, యశ్వంత్, సాగర్, రాజశేఖర్, రోహిత్, కావ్య, లలిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.