ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు
జర్నలిస్టుల డిమాండ్ న్యాయమైనది.. వెంటనే స్థలాలు కేటాయించాలి
ఖమ్మం, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన ఉద్యమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం మయూరి సెంటర్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న డిమాండ్ న్యాయమైనదని పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత లేక జర్నలిస్టులు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా నుంచి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, గౌరవ సలహాదారు పారా నాగేశ్వరరావు, అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవికుమార్, ఐజేయూ నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.