Poples Voice
Date of Publish : 28/11/2026, 9:02 am
Published by PEOPLES VOICE

పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్!

పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్!

జిల్లా అధ్యక్షుడిగా తిమ్మడి రఘు.. ప్రధాన కార్యదర్శిగా తిప్పారపు లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక

విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తాం – నూతన అధ్యక్ష, కార్యదర్శులు

ఖమ్మం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. గురువారం ఖమ్మం పట్టణంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నిర్మాణ జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పాలేరుకు చెందిన తిమ్మడి రఘు, ప్రధాన కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన తిప్పారపు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. శుక్రవారం పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికను ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా ఇంటర్ విద్యను రద్దు చేయడం వల్ల విద్యారంగంపై పడే ప్రభావాలు, భవిష్యత్ పరిణామాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఇంటర్ విద్య రద్దు – పరిణామాలు, విద్యారంగంపై ప్రభావం' అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన జిల్లా కమిటీ వివరాలు:

- జిల్లా అధ్యక్షుడు: తిమ్మడి రఘు (పాలేరు)

- జిల్లా ప్రధాన కార్యదర్శి: తిప్పారపు లక్ష్మణ్ (ఖమ్మం)

- ఉపాధ్యక్షుడు: గంట మనోహర్

- సహాయ కార్యదర్శి: పాండవుల సుశాంత్

- కోశాధికారి: బానోత్ స్టాలిన్

- కమిటీ సభ్యులు: కార్తీక్, గణేష్, వెంకటేష్, సిద్ధు

- మరో నలుగురు కో-ఆప్షన్ సభ్యులతో కలిపి మొత్తం 13 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save