Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ విజయవంతంగా ముగింపు

Author
Posted By peoplesvoice
| 01 Oct 2026, 01:49 PM | TELANGANA, ఖమ్మం
ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ విజయవంతంగా ముగింపు

ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ విజయవంతంగా ముగింపు

కొత్త అధ్యక్షుడిగా నిర్భయ్ సింగ్ దుడికే.. ప్రధాన కార్యదర్శిగా జె.వి. చలపతిరావు ఎన్నిక

రైతులు, వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపు

ఖమ్మం, అక్టోబర్ 1 (ఆయుధం):

ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ ఖమ్మంలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లోని కామ్రేడ్‌ అజ్మీర్‌ సింగ్‌ హాల్‌లో బుధవారం రాత్రి సుమారు 8.30 గంటలకు ముగిసింది. మహాసభలో కొత్త అధ్యక్షుడిగా కామ్రేడ్‌ నిర్భయ్‌ సింగ్‌ దుడికే, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్‌ జె.వి. చలపతిరావు ఎన్నికయ్యారు.

కొత్తగా ఎన్నికైన నాయకులు తమపై అప్పగించిన బాధ్యతలను స్వీకరిస్తూ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ భారతదేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, భూమిలేని వర్గాల సమస్యలపై మరింత దృష్టి సారించాలని, జీవనాధార భూమి, అడవులు, నదుల పరిరక్షణకు ప్రజా ఉద్యమాలను నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కొత్త జెండాకు ఆమోదం

మహాసభలో ఏఐకేఎంఎస్‌ కొత్త జెండాను ఆమోదించింది. ఎరుపు రంగు నేపథ్యంలో ఎడమవైపు ఆకుపచ్చ పట్టీపై ఏఐకేఎంఎస్‌ చిహ్నాన్ని, ఎరుపు భాగంలో నాగలి, కొడవలి వంటి రైతులు, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన చిహ్నాలను పొందుపరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

17 తీర్మానాలకు ఆమోదం

ఇవి కూడా చదవండి

మహాసభలో రైతులు, వ్యవసాయ కార్మికులు, నీటి వనరులు, భూ సమస్యలు, కనీస మద్దతు ధర, రుణమాఫీ, అటవీ హక్కులు తదితర అంశాలపై మొత్తం 17 తీర్మానాలను పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. నీటి సంక్షోభం, కరువు–వరదల నిర్వహణ, అంతర్రాష్ట్ర నీటి పంపిణీ, పంటల విధానం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఇథనాల్‌ ఉత్పత్తి, ఎంఎస్‌పీ, రైతుల రుణభారం, వ్యవసాయ కార్మికుల సమస్యలు వంటి అంశాలు తీర్మానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే UAPA, NSA వంటి చట్టాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వాటి రద్దును కోరినట్లు, భూ పంపిణీ, అటవీ హక్కుల అమలు, బలవంతపు నిర్వాసితత్వం, కార్పొరేట్‌ జోక్యం వంటి అంశాలపై కూడా తీర్మానాలు చేసినట్లు తెలిపారు.

కేంద్ర కార్యవర్గం ఎన్నిక

మహాసభలో 15 మంది సభ్యులతో కేంద్ర కార్యనిర్వాహక కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఆశిష్‌ మిట్టల్‌, టి. సుధాకర్‌, కార్యదర్శులుగా బాలచంద్ర, రవీందర్‌ సింగ్‌ తదితరులు ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు. కోశాధికారిగా చిట్టిపాలెం వెంకటేశ్వర్లు తో పాటు పలువురు సభ్యులను కమిటీలోకి ఎన్నుకున్నారు.

రైతుల సమస్యలపై పోరాటాలకు పిలుపు

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణభారం, భూమి, నీరు, అటవీ హక్కులు వంటి అంశాలపై ఉద్యమాలను విస్తరించాలని పిలుపునిచ్చారు.

మహాసభకు సహకరించిన సుమారు 100 మంది వాలంటీర్లను ప్రతినిధులు అభినందించారు. అనంతరం ‘అరుణోదయ’ బృందం పాటలతో మహాసభ ముగిసింది.

విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నిర్భయ్‌ సింగ్‌ దుడికే, జాతీయ ప్రధాన కార్యదర్శి జె.వి. చలపతిరావు, జాతీయ ఉపాధ్యక్షులు టి. సుధాకర్‌, ఆశిష్‌ మిట్టల్‌, జాతీయ కార్యదర్శి రవీందర్‌ సింగ్‌ పాటియాల, జాతీయ కార్యవర్గ సభ్యులు వి. వెంకట్రామయ్య, గోని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.