చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం

చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: జమ్ముల జితేందర్ రెడ్డి
చింతకాని,నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):
చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం సీపీఐ చింతకాని మండల సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచాలని కోరారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, దళితబంధు పథకం కింద గతంలో మంజూరైన రూ.15.50 కోట్లను 155 దళిత కుటుంబాలకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా 3,800 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇవ్వాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. పేదలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో పాటు ప్రతి ఒక్కరికీ 12 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంకటాయపాలెం నుంచి కొదుమూరు వరకు ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి విస్తరణను గ్రామాల్లో 50 అడుగులకు పరిమితం చేయాలని, చిన్నమండవ గ్రామంలో మున్నేరు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండపర్తి గోవిందరావు, ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్, కూచిపూడి రవి, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, జిల్లా సమితి సభ్యులు పర్చా రామచంద్రరావు, నారపోగు హేమ, మండల సహాయ కార్యదర్శులు మార్గం శ్రీను, రాఘవాపురం ఉపసర్పంచ్ అబ్బూరి మహేష్, నాయకులు పగిడిపల్లి ఏసు, దొబ్బల వెంగళరావు, పదిలం వెంకటనరసయ్య, గోగుల ఆది, గోగుల వెంకట్రావు, హుస్సేన్, గుండ్ల బేబీ రాణి, బస్వాపురం సర్పంచ్ ఆవుల నరసింహారావు, తుపాకుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యం! _ ఆకుతోట ఆదినారాయణ












