ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తం.. నీటి పొదుపు, ఆరుతడి పంటల సాగుపై వందనం గ్రామసభ

సూపర్ ఎల్‌నినో ప్రభావాలపై వందనం గ్రామంలో అవగాహన సభ
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి.. నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలి
చింతకాని , అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్):
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు వందనం గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి అయినాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు, గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వరి, మొక్కజొన్న వంటి పంటల సాగుపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని రైతులకు సూచించారు. నీటి వినియోగం తక్కువగా ఉండే వేరుశనగ, పెసర, జొన్న తదితర ఆరుతడి పంటల సాగును ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని తెలిపారు.
గ్రామంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇళ్ల వద్ద నీటి వృథాను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానా విధించడంతో పాటు పంపు కనెక్షన్ తొలగించే చర్యలు చేపట్టాలని ఎంఆర్‌ఓ కరుణశ్రీ గ్రామ కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్తును కూడా పొదుపుగా వినియోగించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ కరుణశ్రీ, ఎంపీఓ పర్వీన్ కైసర్, ఏఈఓ ఆయేషా, జీపీఓ విష్ణు నారాయణ, ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్. కె పాషా ( జర్నలిస్ట్ ), ఉపసర్పంచ్ అమరులపూడి శ్రీను, అధ్యక్షుడు పొన్నం చిన్న శంకర్ రావు , ఉపాధ్యక్షుడు ఎస్.కె. మోయిన్, బీఎల్‌ఏ మిట్టపల్లి కొండలరావు, ఎస్.కె. మున్నా, వార్డు సభ్యులు లకావత్ సత్యనారాయణ, ఆవుల హరీష్, పొన్నం రాణి, ఆవుల నాగమణి, ఆవుల చిన్న సైదులు, కంసాని శంకర్రావు, వేములపల్లి సూర్యం, వేములపల్లి హరీష్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: తిమ్మినేనిపాలెంలో ట్రాక్టర్ ట్రైలర్ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు












