సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్

- ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో అక్రమాలు
- సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు
- నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో వెలుగుచూసిన మోసం
- ప్రభుత్వానికి రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా
సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్
తెలంగాణ, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్)
తెలంగాణలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సన్న బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 14 మంది రైస్ మిల్లర్లను సీఐడీ అరెస్ట్ చేసింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి.
పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ ఈ నెల 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ దర్యాప్తు చేపట్టింది. మిల్లర్లు తమకు కేటాయించిన సన్న రకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి, ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రయోగశాల పరీక్షల్లోనూ సరఫరా చేసిన బియ్యం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లు తేలిందని వెల్లడించారు.
నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లుల నుంచి సుమారు 3,385 టన్నుల దొడ్డు బియ్యం సరఫరా అయినట్లు విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో బోనస్ రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. బియ్యం సేకరణను నిలిపివేయడంతో సుమారు రూ.242 కోట్ల మేర నష్టాన్ని నివారించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సీఐడీ, బియ్యం మళ్లింపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాల ఉల్లంఘన, క్రిమినల్ కుట్ర కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా అనే అంశంపైనా విచారణ జరుపుతోంది.
ఇది కూడా చదవండి :: మహా ధర్నాను జయప్రదం చేయాలి












