కామన్ స్కూల్ విధానమే సామాజిక సమానత్వానికి పునాది!

కామన్ స్కూల్ విధానమే సామాజిక సమానత్వానికి పునాది!
ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉద్యమించాలి.. పేద విద్యార్థుల హక్కుల కోసం పోరాడాలి – నాయకుల పిలుపు
అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఉచిత విద్య అవసరం: టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్
ఖమ్మం, నవంబర్ 13 (పీపుల్స్ వాయిస్):
కామన్ స్కూల్ విద్యా విధానం అమలుతోనే సమాజంలో సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించిన టిపిటిఎఫ్ ఖమ్మం డివిజన్ నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం జరగాలంటే అందరికీ సమానమైన, ఉచిత విద్య అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. పాలకులు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ వైపు విద్యావ్యవస్థను మళ్లిస్తున్నారని విమర్శించారు. దీంతో విద్య వ్యాపారంగా మారి ప్రభుత్వ విద్య క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి ఝాన్సీ, పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిమ్మిడి రఘుబాబు, తిప్పారపు లక్ష్మణ్ మాట్లాడుతూ శాస్త్రీయ విద్యా సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, దాసరి చేరాలు, రంగవల్లి, స్నేహలతల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆశయాలు, స్ఫూర్తితో పేద విద్యార్థుల విద్యా హక్కుల కోసం విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
టిపిటిఎఫ్ ఖమ్మం డివిజన్ నూతన కమిటీ ఎన్నిక
సమావేశంలో టిపిటిఎఫ్ ఖమ్మం డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- అధ్యక్షులు: కార్తీక్ రెడ్డి
- ఉపాధ్యక్షులు: వెంకటేష్
- ప్రధాన కార్యదర్శి: పాండవుల సుశాంత్
- సహాయ కార్యదర్శి: స్టాలిన్
- కోశాధికారి: మనోజ్
కమిటీ సభ్యులుగా: చిట్టిబాబు, శ్రీనాథ్, సిద్ధు, బాలు, చరణ్, అభిలాష్, ప్రవీణ్, గణేష్‌తో పాటు మరో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు.
ఇది కూడా చదవండి :: తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు












