మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి ఖమ్మం మహిళలకు అండగా నిలుస్తా
- ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన
- కుట్టుమిషన్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
మహిళల సాధికారతకు మరిన్ని నిధులు తీసుకొస్తా!
ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం మహిళల సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. పేదరికంలో ఉన్న మహిళలు, ఒంటరి మహిళలు స్వయంకృషి, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని కే.సీ. పుల్లయ్య ఫౌండేషన్ నారీ నైపుణ్య శిక్షణా కేంద్రంలో మంగళవారం ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన అనంతరం జీ మాల్ ఉమామహేశ్వరరావుతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, ఆత్మగౌరవంతో జీవించేందుకు కే.సీ. పుల్లయ్య ఫౌండేషన్, థెరిస్సా మహిళా మండలి, ఎస్వీ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటులో పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన భూమిక పోషించిందని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని కొనసాగాలని ఆకాంక్షించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూలై 24న వరంగల్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 'స్మైల్ ఏ గిఫ్ట్' కార్యక్రమం ద్వారా 2 వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు బహూకరించారని ఎంపీ గుర్తుచేశారు. తన గాయత్రి గ్రానైట్స్ సంస్థతో పాటు జీ మాల్ ఉమామహేశ్వరరావు సహకారంతో మరికొంతమంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తామని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా శిక్షణా కేంద్రం విస్తరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.చిన్న పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన వారిని సూరత్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చూశానని చెప్పారు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అటువంటి వారికి అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు.అనంతరం నిర్వాహకులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పూలకుండీ అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చల్లా సుధా, సుందరరావు, స్వప్న, ఖతీజా, ఆవుల నాగమణి, ఉమ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్












