తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి!

తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి!
ఆయన పాటలు తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశాయి.. సంస్మరణ సభలో వక్తల నివాళి
ఖమ్మం, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన కలం, గళంతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీకి ఖమ్మం జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, కవులు, గాయకులు, రచయితలు, సాంస్కృతిక కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు సంస్మరణ సభ నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు.1961లో వరంగల్ జిల్లా ముదునూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ, నిరక్షరాస్యుడిగా జీవితం ప్రారంభించి గొర్రెలు కాస్తూ, సుతారి పని చేస్తూ తన అనుభవాలను అక్షరాలుగా మలిచిన అసాధారణ కవి. ప్రజల జీవన గమనాన్ని, సామాజిక పరిస్థితులను తన పాటల ద్వారా ప్రతిబింబిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన రచించిన పాటలు ప్రజలను విశేషంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' అనే రాష్ట్ర గీతంతో పాటు 'ఒకటే జననం ఒకటే మరణం', 'కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా', 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు' వంటి పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి. 'చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె' వంటి ఎన్నో గీతాలతో తెలంగాణ సాహితీ లోకంలో చెరగని ముద్ర వేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు గల్లీ నుంచి పల్లె వరకు మారుమోగాయని, ప్రజలను ఉద్యమాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించాయని వక్తలు పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం పాటలకే పరిమితం కాకుండా తెలంగాణ అస్తిత్వానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను సైతం ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.టీఎస్‌ఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాగి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలో ఉద్యమకారులు డోకుపత్తి సుబ్బారావు, దేవిరెడ్డి విజయ్, బొబ్బిలి భరత్ చంద్ర, వి. ఫైవ్ కేవీ గాజుల రవికుమార్, అడ్వకేట్ నరేందర్, కాసాని నాగేశ్వరరావు, కవి కృష్ణ, తెలంగాణ సాంస్కృతిక సారథులు పమ్మి రవి, ఫైర్ రవి, తెలంగాణ ఉద్యమ నాయకులు దాసరి శ్రీను, సుంచు వెంకటేశ్వర్లు, మరో కవి కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్న పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా!












