అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం! మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

- నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లు చెరిగిపోని విప్లవ జ్ఞాపకాలు
- 50వ వర్ధంతి సభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ
అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం!
ఇల్లందు, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
ప్రజా ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య, పీడీఎస్‌యూ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లు అమరులైనా వారు నమ్మిన ఆశయాలు నేటికీ సజీవంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్ అన్నారు. వారి త్యాగాలు, విప్లవ పోరాటాలు ప్రజల హృదయాల్లో చెరిగిపోని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని కొనియాడారు.పీడీఎస్‌యూ ఇల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌ల 50వ వర్ధంతి సభను గురువారం చీకటిగండ్ల అడవిలో డివిజన్ నాయకుడు గంగాధర్ గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. సభకు ముందు విద్యార్థులు అమరవీరుల ఆశయాల సాధనకు సంకల్పిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య బిగిపిడికిలి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల స్ఫూర్తితో అనేకమంది విద్యార్థులు అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. 1975 నవంబర్‌లో రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, జానకిరామిరెడ్డి వంటి విప్లవకారులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపించారు. వారి మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు, ప్రజలకు అప్పగించకుండా అప్పటి వెంగళరావు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.అమరుల త్యాగాల చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు వారు ఆశించిన సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.దేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పిస్తూ పరీక్ష పేపర్ల లీకేజీలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగంపై దాడి, ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధం కొనసాగుతున్నాయని అన్నారు. దళితులు, ఆదివాసీలు, క్రైస్తవులు, ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల తొలగింపు ద్వారా ఎన్నికల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు విద్యార్థులు సంఘటితమై ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు చందావత్ శ్రావణ్, గుమ్మడి చైతన్య, గుమ్మడి పవిత్ర, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిమ్మిడి రఘు, ఇల్లందు డివిజన్ నాయకులు గంగాధర్ గణేష్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర బిచ్చ, ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకుడు బుర్ర వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు యదళ్లపల్లి సావిత్రి, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు బుర్ర రాఘవులు, పీడీఎస్‌యూ నాయకులు ఆయుష్, శ్రావణి, నాగచైతన్య, హేమచంద్ర, జస్వంత్, పండు, హేమంత్, గుమ్మడి రవీనా, వెన్సిక, నిత్య, లిఖిత, మినీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్












