పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు!

పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు!
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక.. విద్యార్థి ఉద్యమ నాయకుడి నుంచి జాతీయ నాయకత్వం వరకు స్ఫూర్తిదాయక ప్రస్థానం
ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాట బాట పట్టి, ఒక మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయి కార్మిక నాయకత్వం వరకు ఎదిగిన తోట రామాంజనేయులుకు అరుదైన గౌరవం దక్కింది. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 43వ జాతీయ మహాసభల్లో ఆయన జాతీయ సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్ 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరిగిన ఈ మహాసభల్లో ఆయనకు లభించిన గుర్తింపుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా జీవితంలోకి అడుగు..
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన తోట రామాంజనేయులు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మధిర పట్టణ కార్యదర్శిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. విద్యార్థుల హక్కులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ వసతులు, విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జైలు జీవితాన్ని సైతం అనుభవించారు. విద్యార్థి ఉద్యమాల్లో పొందిన అనుభవమే ఆయనను నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దింది.
కార్మిక ఉద్యమానికి ఖమ్మంలో కొత్త ఊపిరి..న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన అనంతరం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపల్, ఆశా, అంగన్‌వాడీ, భవన నిర్మాణ, హమాలీ, ఆర్టీసీ, సింగరేణి తదితర రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించారు. కార్మికులను సంఘటితం చేస్తూ వారి హక్కులు, వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలను ముందుకు నడిపించారు.
రెండో ఏఎన్ఎంల ఉద్యమంలో కీలక పాత్ర..
తోట రామాంజనేయులు నాయకత్వ పటిమకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండో ఏఎన్ఎంల ఉద్యమం ఒక నిదర్శనం. రాష్ట్రంలోని రెండో ఏఎన్ఎంలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సుమారు 4,000 మందిని ఏఐటీయూసీ పరిధిలో సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు నాయకత్వం వహించారు.
ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సమస్యలను బలంగా వినిపించి పలు డిమాండ్ల సాధనకు కృషి చేశారు. ఏఎన్ఎంల నియామక నోటిఫికేషన్‌లో అదనంగా 400 పోస్టులు పెంచేలా, ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 45 నుంచి 53 సంవత్సరాలకు పెంచేలా కృషి చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి 30 మార్కుల వెయిటేజీ కల్పించేలా పోరాడారు. ఈ నిర్ణయాలు అనేక మంది ఏఎన్ఎంలకు ప్రయోజనం చేకూర్చాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
సమ్మె కాలపు వేతనం సాధించడంలో ప్రత్యేక గుర్తింపు..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వివిధ రంగాల్లో అనేక సమ్మెలు జరిగినప్పటికీ, రెండో ఏఎన్ఎంల సమ్మె కాలపు వేతనాన్ని సాధించుకోవడం ఈ ఉద్యమంలో ప్రత్యేక విజయంగా నిలిచింది. తోట రామాంజనేయులు నాయకత్వంలో సాగిన పోరాటం ఫలితంగా సమ్మె కాలపు వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేయడం కార్మిక ఉద్యమంలో కీలక పరిణామంగా నిలిచింది.
రాష్ట్ర నాయకత్వం నుంచి జాతీయ సమితి వరకు..
కార్మిక రంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన 43వ జాతీయ మహాసభల్లో జాతీయ సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆయన ప్రస్థానం మరో కీలక మైలురాయిని చేరుకుంది.
అభినందనల వెల్లువ..రాపల్లి గ్రామం నుంచి ప్రారంభమైన తోట రామాంజనేయులు ప్రస్థానం నేడు జాతీయ కార్మిక నాయకత్వం వరకు చేరుకోవడం పట్ల ప్రజా సంఘాలు, కార్మిక నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, రెండో ఏఎన్ఎంలు, రాపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి :: సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు












