అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్

అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి
రెండు, మూడు రోజుల్లో ఇవ్వకుంటే డీపీఆర్‌ఓ కార్యాలయం ముట్టడి.. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష
జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన టీడబ్ల్యుజేఎఫ్ … నేతలు
ఖమ్మం, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అర్హులైన జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యుజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల స్థలాన్ని ఫెడరేషన్ నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ.. ఏడు నెలలు గడిచినా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కార్డులు లేక జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సదుపాయాలు, వృత్తిపరమైన విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేబుల్ ఛానళ్లతో పాటు చిన్న, మధ్య, పెద్ద పత్రికల్లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రెండు, మూడు రోజుల్లో పెండింగ్ కార్డులు జారీ చేయకపోతే డీపీఆర్‌ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం డిసెంబర్ 5 నుంచి 9 వరకు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఆర్ఓ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేందర్ రెడ్డి, టీఎస్ చక్రవర్తి, స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు నలుబోలు మధుశ్రీ, టీబీసీఏ జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, జిల్లా కమిటీ సభ్యులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దగ్గుపాటి మాధవరావు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, వివిధ మండలాల జర్నలిస్టులు, కెమెరామెన్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం












