పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది

పత్తి చేనులో భారీ కొండచిలువ కలకలం!
70 కిలోల పైతాన్‌ను సురక్షితంగా పట్టుకున్న అటవీ సిబ్బంది
నేరడ, నవంబర్ 20 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ రెవెన్యూ పరిధిలోని శ్రీ గంగమ్మ గుడి సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. రైతు పత్తి చేనులో పత్తి తీస్తున్న కూలీలకు గురువారం భారీ పైతాన్ కనిపించడంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై చేను నుంచి బయటకు పరుగులు తీశారు.అనంతరం గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీకి సమాచారం అందించగా, ఆయన వెంటనే స్పందించి అటవీ శాఖ సిబ్బందికి తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్థానికుల సహాయంతో చేనులో నక్కి ఉన్న భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు.
సుమారు 70 కిలోల బరువున్న ఈ భారీ పైతాన్ ఇటీవల ఏదైనా జంతువును ఆహారంగా తీసుకుని విశ్రాంతి కోసం పత్తి చేనులోకి వచ్చి ఉండవచ్చని అటవీ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. అటవీ సిబ్బంది సురక్షితంగా కొండచిలువను పట్టుకోవడంతో కూలీలు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అర్జున్, సీపీఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంకెన నాగేశ్వరరావు, గ్రామ ఉపసర్పంచ్ కోట బాలేష్, చెవుల తిరుపతిరావు, గ్రామపంచాయతీ సిబ్బంది కనకపూడి శంకర్రావు, గుజ్జర్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్












